Placeholder image

పవిత్ర యమునా నది పుష్కరాలు 2026 - సంపూర్ణ వివరాలు/ Yamuna River Pushkara's - Complete Details

యమునా నది భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు ప్రముఖమైన నదులలో ఒకటి. మన పురాణాలలో యమునా నది కేవలం ఒక జలప్రవాహం మాత్రమే కాదు, ఆమె ఒక దేవత. యమునా దేవి సూర్యభగవానుడు మరియు సంజ్ఞాదేవిల పుత్రిక. ఈమె మృత్యుదేవత అయిన యమధర్మరాజుకు సొంత సోదరి. అదేవిధంగా శని దేవుడు, యమునా దేవి ఇద్దరూ సొంత అన్నాచెల్లెళ్లు . యమునా దేవి ఎప్పుడూ శాంత స్వరూపిణిగా, తన సోదరులందరి క్షేమాన్ని కోరేది.  యమధర్మరాజు , శనైచ్చరుడు మరియు యమునా దేవి ముగ్గురూ సూర్యుని నుండి ఉద్భవించిన వారే కావడం వల్ల ముగ్గురిలోనూ ఆ సూర్య భగవానుడి అంశ శక్తి  ఉంటుంది. 

శనైచ్చరుడు న్యాయాధికారిగా మనం జీవించి వుండగా కర్మఫలాలను ప్రసాదిస్తారు. యమ ధర్మ రాజు మన మరణానంతరం మన ప్రారబ్ధ ఖర్మ ఫలితాన్నినిర్ణయిస్తారు. ఈ విధంగా శని మరియు యమ ధర్మరాజు మనుషుల పాపాలను లెక్క కడుతుంటే, యమునా దేవి మాత్రం భక్తుల పాపాలను కడిగివేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకే యమునా దేవిని ఆశ్రయిస్తే యమ ధర్మరాజు మరియు శని దేవుడి ఇద్దరి అనుగ్రహం లభించి  అపమృత్యు దోషాలు తొలగిపోతాయి మరియు ఏలినాటి శని, అష్టమ శని , అర్ధ అష్టమ శని దశ తీవ్రత తగ్గుతాయి. 

మరిన్ని వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.

 


భాగవతంలో కూడా యమునా నదికి విశిష్ట స్థానం ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి లీలలన్నీ యమునా నది తీరంలోనే జరిగాయి. కృష్ణుడు జన్మించిన రాత్రి వసుదేవుడు ఆయనను రేపల్లెకు తీసుకెళ్తుండగా, పొంగిపొరలుతున్న యమునా నది కృష్ణుడి పాదాలను తాకి శాంతించి, వారికి దారి ఇచ్చింది. కాళీయుడనే సర్పం యమునా నదిని విషపూరితం చేసినప్పుడు, శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసి యమునను కాపాడాడు. పురాణాల ప్రకారం యమునా దేవి శ్రీకృష్ణుని అష్టమహిషులు అంటే శ్రీ కృష్ణుల వారి ఎనిమిది మంది భార్యలలో ఒకరు. భారతదేశ రాజధాని ఈ నది ఒడ్డునే ఉంది. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ యమునా నది ఒడ్డునే నిర్మించబడింది.

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) వద్ద యమునా నది గంగానదితో కలుస్తుంది. ఇక్కడే అంతర్వాహినిగా ప్రవహించే పవిత్ర సరస్వతి నది కూడా కలుస్తుంది. ఈ మూడు పవిత్ర నదుల  కలయికనే "త్రివేణీ సంగమం" అంటారు. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా "కుంభమేళా" జరుగుతుంది. ఈ సంగమం వద్ద గంగానది నీరు కాస్త తెల్లగా, యమునా నది నీరు స్పష్టమైన నీలి రంగులో ఉండి స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. 

ఇప్పటి వరకు యమునా నది యొక్క గొప్పదనాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇక అసలు పుష్కరుడు అంటే ఎవరు? గురు గ్రహానికి మరియు పుష్కరునికి సంబంధం ఏమిటి ? ఈ విషయాల గురించి చర్చించుకుందాం. 

ఈ సృష్టిలోని సమస్త జీవరాశుల తలరాతలు నిర్ణయించే ఆ బ్రహ్మ దేవుడి కమండలంలోని తీర్ధమే ఈ భూమిపై ఉన్న సమస్త జలరాశి కి మూలాధారం. ఆ బ్రహ్మ దేవుడి కమండలంలోని నీటికి ఉన్న ఆ అమూల్యమైన ప్రాణశక్తి కి ఉన్న పేరే పుష్కరుడు. పుష్కరుడు అంటే నీటికి ప్రాణ శక్తి ప్రసదించేవాడు మరియు నీటిని పవిత్రం చేసే శక్తి కలిగిన వాడు. సృష్టిని రక్షించడానికి, జలాన్ని శుద్ధి చేయడానికి బ్రహ్మదేవుడు ఇతడిని సృష్టించాడు. ఈ పుష్కరుని వలననే భూమిపై ఉన్న నదీ జలాల వలన సమస్త ప్రాణులు జీవిస్తున్నాయి. సమస్త సస్యాలు పండుతున్నాయి. 

నవగ్రహాలలో బృహస్పతి అనగా గురువు ఒక రాశి నుండి మరొక రాశికి సంవత్సరానికి ఒకసారి మారతారు. దేవగురువైన బృహస్పతి తనకు సర్వలోకాల్లో ఉన్న పుణ్య నదులను పవిత్రం చేసే శక్తి కావాలని, అందుకు పుష్కరుడు తనతోనే ఉండాలని బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. అయితే, పుష్కరుడు బ్రహ్మదేవుడిని వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. 

ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రహ్మదేవుడు బృహస్పతికి మరియు పుష్కరునికి మధ్య  ఒక సమన్వయం కుదిర్చాడు. దాని ప్రకారం బృహస్పతి ఒక రాశి నుండి మరో ఏ రాశిలోకి ప్రవేశిస్తాడో, ఆ రాశికి సంబంధించిన నదిలోకి పుష్కరుడు కూడా ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించి మొదటి 12 రోజులు తన దివ్య శక్తిని ఆ నదిలో స్నానం ఆచరించే వారికి ప్రసాదిస్తారు. ఆ మొదటి 12 రోజులానే ఆది పుష్కరాలు అని పేర్కొంటాము. అదే విధంగా గురువు  ఆ రాశి నుండి వెళ్ళిపోయే చివరి 12 రోజులు కూడా పుష్కరుడు తన దివ్య శక్తిని ఆ నదిలో స్నానం ఆచరించే వారికి ప్రసాదిస్తారు. వీటినే అంత్య పుష్కరాలు అని పేర్కొంటాము.

బృహస్పతి ఏ నదికి అధిపతిగా వెళ్తాడో, ఆ నదిని పుష్కరుడు తన స్పర్శతో అమృతతుల్యం చేస్తాడు. అందుకే బృహస్పతి రాశి మార్పును బట్టి మనం పుష్కరాలను జరుపుకుంటాము. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంత కాలం ఆ నదికి విశేషమైన శక్తి ఉంటుందని పురాణ ఉవాచ. అందువల్లనే ఈ సమయంలో నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం అత్యంత పుణ్యప్రదo.  

క్లుప్తంగా చెప్పాలంటే, బృహస్పతి ఒక వాహనంలా తనతో పాటు పుష్కరుడిని తాను  ప్రవేశిస్తున్న నదికి తీసుకువచ్చి ఆ నదికి పవిత్రతను ఇచ్చే విధంగా చేస్తారు. వీరిద్దరి కలయికే "పుష్కరం". పుష్కరాలు అంటే  ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే విశిష్టమైన వేడుక మరియు ఆ నది పరివాహక ప్రాంతాల వారికి ఒక పండుగ.. 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం , పుష్కరుడు అనే పుణ్య పురుషుడు బృహస్పతి (గురు గ్రహం) తో కలిసి ఒక్కో నదిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే, ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. ఉదాహరణకు:

పుష్కర సమయంలో నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల పురాతన నమ్మకం. ఆ సమయంలో ముక్కోటి దేవతలు మరియు పితృ దేవతల అంశ పుష్కరాలు జరుగుతున్న నదిలో ఉంటాయని అనేక  పురాణాలు పేర్కొన్నాయి. అందువల్లనే  మరణించిన  మన పూర్వీకులకు పిండ ప్రదానాలు లేదా తర్పణాలు వదలడానికి ఇది అత్యంత పవిత్రమైన సమయం. అదే విధంగా  ఈ సమయంలో చేసే దాన ధర్మాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తారు.

ఇక యమునా నది పుష్కరాల విషయానికి వస్తే 2026వ సంవత్సరం జూన్ 1వ తేదీ రాత్రి 1.36 నిమిషాలకు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతోటి పవిత్రమైన యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి.  కానీ ఆ సమయానికి సూర్యోదయం కాకపోవడం వలన మరునాడు ఉదయం అంటే జూన్ 2వ తేదీ 2026 మంగళవారం ఉదయం సూర్యోదయ సమయం ఉదయం  5.28 నిమిషాలకు యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి.

పంచాంగ పరిభాషలో చెప్పాలి అని అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయన అధిక జేష్ట మాస బహుళ పాడ్యమి మంగళవారం  అనగా 2 జూన్ 2026 ఉదయం 5.28 నిమిషాలకి  పవిత్ర యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. 

బ్రహ్మ యొక్క ఆజ్ఞ అనుసారం పుష్కరుడు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి 12 రోజులపాటు యమునా నదిలో ఉంటారు.  పుష్కరుడి అంశ ఉన్న ఈ 12 రోజులు కూడా ఒకే రకమైనటువంటి పుష్కరుడి శక్తి  నదిలో ప్రవహిస్తుంది. పుష్కరాలు ప్రారంభమైన ఆ నిమిషంలోనే పుష్కరుడు శక్తి అనంతంగా ఉంటుంది అనే అభిప్రాయంతో అనవసరమైన ప్రమాదాలు కొనితెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలని మనం వివిధ  కుంభమేళాల్లో, వివిధ వేరే నదుల పుష్కరాల విషయంలో చూస్తున్నాము. ఇటువంటి అపోహను విడనాడండి.  

జ్యోతిష్య శాస్త్ర పరంగా యమునా నది పుష్కరాలు ప్రారంభమైన రోజు నుంచి ముగిసే రోజు వరకు ఏ రోజు ఏ నక్షత్రంలో జన్మించిన జాతకులు పవిత్ర పుష్కర స్నానం ఆచరించడం లేదా  పితృతర్పణాధి కార్యక్రమాలు  నిర్వహించడం చేయాలి అనే విషయాన్నీ నేను మీకు సవివరంగా తెలియచేస్తాను. 

యమునా నది పుష్కరాల మొదటి రోజు అనగా 2 జూన్ 2026 మంగళవారం: ఈ రోజున మృగశిర, చిత్త మరియు ధనిష్ట జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల రెండవ రోజు అనగా 3 జూన్ 2026 బుధవారం: ఈ రోజున ఆశ్లేష,  జ్యేష్ట మరియు రేవతి జన్మ నక్షత్రాలలో జన్మించినవారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల మూడవ రోజు అనగా 4 జూన్ 2026 గురువారం: ఈ రోజున సన్యాసాశ్రమం స్వీకరించిన వారు అనగా సాధువులు, అఘోరాలు,  నాగా సాధువులు,  వైధవ్యం పొందినటువంటి పురుషులు లేదా స్త్రీలు లేదా తమ వంశ గోత్రనామాలు తెలియని వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల నాలుగవ రోజు అనగా 5 జూన్ 2026 శుక్రవారం: ఈ రోజున భరణి, పుబ్బ మరియు పూర్వాషాడ జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల అయిదవ రోజు అనగా 6 జూన్ 2026 శనివారం: ఈ రోజున పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల ఆరవ రోజు అనగా 7 జూన్ 2026 ఆదివారం: ఈ రోజున కృత్తిక, ఉత్తర మరియు ఉత్తరాషాడ జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల ఏడవ రోజు అనగా 8 జూన్ 2026 సోమవారం: ఈ రోజున రోహిణి, హస్త మరియు శ్రవణం నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల ఎనిమిదవ రోజు అనగా 9 జూన్ 2026 మంగళవారం: ఈ రోజున తమ జన్మ నక్షత్రం తెలియని వారు లేదా తమ పేరు బలంతో నామ నక్షత్రం పై ఆధారపడిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల తొమ్మిదవ రోజు అనగా 10 జూన్ 2026 బుధవారం: ఈ రోజున ప్రకృతి సంబంధమైన అడ్డంకులు ముఖ్యంగా స్త్రీలకు లేదా మరణించిన మరణమైల ఉన్నవారు లేదా ఏ ఇతర కారణాల వలనైన ఇంతకు ముందు పుష్కర స్నానం ఆచరించని వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల పదవరోజు అనగా 11 జూన్ 2026 గురువారం: ఈ రోజున పునర్వసు, విశాఖ మరియు పూర్వాభాద్ర జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల పదకొండవ రోజు అనగా 12 జూన్ 2026 శుక్రవారం:  ఈ రోజున అశ్విని, ఆరుద్ర మరియు మఖ జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

యమునా నది పుష్కరాల పన్నెండవ రోజు అనగా 13 జూన్ 2026 శనివారం: ఈ రోజున స్వాతి, అనురాధ మరియు మూల నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.  

సాధారణంగా ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులందరూ కూడా కలిసి ఒకేసారి పుష్కర స్నానం ఆచరిస్తారు.  ఒక్కొక్కరిది ఒక్కొక్క జన్మ నక్షత్రం అవుతుంది.  మరి నేను పేర్కొన్నటువంటి వివిధ రోజులు వివిధ జన్మ నక్షత్రాలు కుటుంబంలో ఉన్న వారందరికీ ఒకే రోజు కలసి రావు. అటువంటి అప్పుడు ఏమి చేయాలి? ఎవరైతే కుటుంబ యజమానిగా అంటే కుటుంబ పెద్దగా ఉంటారో మరో విధంగా చెప్పాలి అంటే తమ వంశ పెద్దలకు పితృ తర్పణ సంస్కారం చేస్తారో వారి నక్షత్రమే ప్రధానంగా చూసుకోవాలి. 

ఉదాహరణకు ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుందాం. వారి జన్మ నక్షత్రాలు వేరు వేరు.  ఈ ఐదుగురికి కూడా జ్యోతిష్య శాస్త్ర పరంగా ఒక్కొక్క రోజు స్నానం ఆచరించడం అనేది అనుకూలమైన రోజుగా ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో ఆ కుటుంబ యజమాని ఎవరు అంటే కుటుంబంలో ఉన్న పెద్ద వయసు వారు ఎవరో  లేదా పితృ సంస్కారం చేస్తారో వారి నక్షత్రానికి ఏ రోజైతే కేటాయించబడిందో ఆ రోజునే కుటుంబం మొత్తం పుష్కర నది స్నాన సంస్కారాన్ని ఆచరించాలి. 

పుష్కర నది స్నానం చేస్తున్నప్పుడు  ముఖ్యంగా మనసులో పటించాల్సినటువంటి మంత్రం ఏమిటంటే “ ఓం నమో భగవతే పుష్కరాయచ బృహస్పతే స్వాహా”. ఈ మంత్రాన్ని పటిస్తూ పుష్కర స్నానం వేయడం ద్వారా  పుష్కర నదిలో ప్రవహిస్తున్నటువంటి పుష్కరుని మరియు గురు గ్రహ అంశ శక్తిని మనం పొందగలుగుతాము. ఈ మంత్రం ఏ నది పుష్కరాలకు అయినా వర్తిస్తుంది. ఈ పవిత్ర మంత్రాన్ని పటిస్తూ పుష్కర నది స్నానo చేసిన తదుపరి మీకు తోచిన విధంగా అది ఎంత చిన్న మొత్తం అయినా లేదా ఎంత పెద్ద మొత్తమైనా సరే అవసరార్ధులకు, పేద బ్రాహ్మణులకు దానధర్మాలు చేయండి. 

ఏ పుష్కరాలైనా లేదా కుంభమేళాలైనా మనలో చాలా మంది చేస్తున్నటువంటి ఒక తప్పు ఏమిటంటే పితృతర్పణం చేసిన తదుపరి నేరుగా తమ యొక్క ఇంటికే వెళ్లాలి. పితృతర్పణం చేశాక వేరే దైవ దర్శనానికి వెళ్ళకూడదు. పుష్కర నది స్నాన సంస్కారం ఆచరించడానికి ముందుగానే అంటే మీరు పుష్కర తీర్థయాత్రకు వస్తూ ఉండగా ఏ దేవాలయాలని లేదా పుణ్యక్షేత్రాలని సందర్శించాలని అనుకుంటున్నారో వాటి సందర్శన చేసుకుని అప్పుడు పుష్కర నది స్నానం చేసి పితృతర్పణాలు చేసిన తర్వాత నేరుగా మీ యొక్క గృహాలకు వెళ్లాలి. 

గంగానది కేవలం స్నానం చేయడం వల్ల పాపాలను హరిస్తే, యమునా నదిని దర్శించుకున్నా లేదా ఆమె నీటిని తాకినా ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంతటి పవిత్ర యమునా నది పుష్కరాల యొక్క సమయంలో నేను చెప్పిన విధంగా పుష్కర నది స్నాన సంస్కారం ఆచరించండి.  ఆ పుష్కరిడి యొక్క మరియు బృహస్పతి యొక్క శక్తి అంశను , పుష్కర స్నాన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అపమృత్యు దోష తీవ్రత తగ్గుతుంది. ఏలినాటి శని దశ, అష్టమ శని దశ మరియు అర్ధ అష్టమ శని దశ దోషాల తీవ్రత తగ్గుతుంది.  

ప్రత్యక్ష దైవాలైన  ఆ నవగ్రహాల అనుగ్రహం మన మీద ఉండాలని మనమందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సెలవు - Dr Aravind Sidhanthi

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.