Sree Shubhakruth Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Free Telugu Rasi Phalalu
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం - 05, వ్యయం - 05, రాజ పూజ్యం - 09, అవమానం - 02
పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభించుటను సూచించుచున్నది.
కర్కాటక రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా ఆశించిన ఆయుర్ ఆరోగ్య భాగ్యములు సంపూర్ణంగా లభించును. గురువు కర్కాటక రాశి వారికి విశేష కీర్తి ప్రతిష్టలను, ప్రభుత్వ సన్మానములను ఏర్పరచును. రాజకీయ రంగంలోని వారికి రాజ సమాన హోదా లభింప చేయును. (వ్యక్తిగత జాతకంలో గజకేసరి యోగం ఉండవలెను. లేనిచో కొద్దిపాటి హోదా కలిగిన స్వల్పకాలిక పదవి మాత్రమే లభించును.) గ్రంధ రచనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ సంవత్సరం అతి చక్కటి అనుకూలత ఏర్పరచును. నూతన భూ లేదా గృహ సంపద ఏర్పరచు కొనవలననే కోరిక ఈ సంవత్సరం ఫలించును. స్వధర్మం పట్ల, ఆచార వ్యవహారాల పట్ల ప్రీతి కలిగి పుణ్య కార్యములు చేయుదురు. వారసత్వ సంపదకు సంబంధించిన వివాదాలు ఊహించని రీతిలో సులువుగా పరిష్కారం అవుతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు, ఆశించిన ఫలితం లభిస్తాయి. ఆర్ధిక ఋణాలు తీర్చివేస్తారు.
కర్కాటక రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శని అంతగా యోగించరు. శనైచ్చరుని ప్రతికూల ప్రభావం వలన ఆనారోగ్య మూలక ధన వ్యయం ఎదురగును. వైవాహిక జీవనంలో గొడవలు తరచుగా ఏర్పడును. జీవిత భాగస్వామి వ్యవహారాలలో ఆర్ధిక పరంగా దురాశ పనికి రాదు. మీపై జీవిత భాగస్వామి కి ఉన్న విశ్వాసం కోల్పోవు సూచనలు ఉన్నవి. ప్రధమ వివాహం నష్ట పోయి మరల వివాహం కొరకు ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఈ సంవత్సరం శనైచ్చరుడు పునర్ వివాహ యోగం కలుగ చేయును. విదేశీ జీవన ప్రయత్నాలు చేయువారికి ప్రారంభంలో అనేక అవరోధాలను ఏర్పరచును. విద్యార్ధులు శ్రమానంతర విజయాలను పొందుదురు. కర్కాటక రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
కర్కాటక రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాహువు కొద్దిపాటి ప్రతికూల ఫలితాలు ఏర్పరచును. అతి కాముకత వలన వైవాహిక జీవనంలో బ్రష్టత్వం ఏర్పరచును. అన్ని విషయాలలో గర్వంతో ప్రవర్తించుట మంచిది కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకొంటారు. యువత తగాదాలందు ఇష్టత కలిగి ఉండి ప్రగల్భాలు ఆడుట వలన అపఖ్యాతి పాలగుదురు. నీతి నియమములు విడిచి పెట్టుట మంచిది కాదని కూడా అనుభవ పూర్వకంగా తెలుసుకొందురు. కర్కాటక రాశి వారికి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలకు రాహువు ఈ సంవత్సరం సహకరించును.
కర్కాటకరాశి వారు శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన మిక్కిలి తొందరపాటు తత్త్వం ప్రదర్శించి తన్ములక ఇబ్బందులు ఎదుర్కొందురు. కావునా ముఖ్య నిర్ణయాలు తీసుకొను సందర్భాలలో నిదానత అవసరం. విష కీటకాదుల వలన ప్రమాదములు ఎదుర్కోను సూచనలు ఉన్నవి. అవసరానికి మిత్రుల నుండి సహకారం లభించదు. పూర్తిగా మిత్రులను నమ్ముకొని పనులు ప్రారంభించుట మంచిది కాదు. వ్యక్త్రిగత జీవనంలో స్వ లేదా ఉచ్చ క్షేత్రంలో కేతువును కలిగి ఉన్న వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా వాహన ముద్రిదికారం లభించును.
ఏప్రిల్ 2022 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో వ్యవహారములు అనుకూలంగా నడచును. ధనాదాయం సామాన్యం. వైద్య రంగంలో జీవించు వారు ఆశించిన విజయాలు పొందుదురు. మీ రంగాలలో చక్కటి గుర్తింపు ఏర్పడును. నూతన స్నేహ వర్గాలు ఏర్పడును. సామజిక సంబంధాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులకు మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్టితులు ఎదురగును. ద్వితీయ తృతీయ వారాలలో చిన్నపాటి అనారోగ్య సమస్య చికాకు పరచును. విదేశీ జీవన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు, గృహ ఆరంభ సంబంధ ప్రయత్నాలు శుభకరం. నిరుద్యోగులకు మాత్రం ఈ మాసం అంత అనుకూలమైనది కాదు.
మే 2022 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసం విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయుటకు, నివాస ప్రాంత మార్పు ప్రయత్నాలు చేయుటకు, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేయుటకు, పై అధికారులకు సిఫారసు చేయించుకొవడానికి, నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు చేయుటకు అనుకూల కాలం. మీ శ్రమ ఫలించును. ఈమసంలో ధనాదాయం బాగుండును. వ్యాపారములు ప్రొత్సాహపూరకంగా కొనసాగు కాలం. కుటుంబ సభ్యుల కు సంబందించిన ఒక సంతోషకరమైన సమాచారం వింటారు. కుటుంబంలో శుభకార్యముల నిర్వహణ కోసం చర్చలు చేస్తారు. నూతన వస్తువులు కొంటారు. వ్యక్తిగత జీవనం సుఖ సంతోషాలతో కొనసాగుతుంది. మీరు కోరుకున్న విధంగా ప్రణాళికాబద్ధమైన జీవనం ఏర్పరచుకోనగలరు. ఈ మాసంలో ధనయోగాలు ఉన్నవి. క్రయ విక్రయాలు చేయవచ్చు.
జూన్ 2022 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్గకాళిక ఆరోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. సోదర సోదరి వర్గం మరియు జీవిత భాగస్వామి తరపు బంధు వర్గంతో పట్టుదల వహించకూడదు. వివాహ ప్రయత్నాలలో ఆశాభంగములు ఎదురవుతాయి. ద్వితీయ వారంలో ఆదాయం కొంత తగ్గుతుంది. రుణ పరమైన సమస్యలు ఎదురవుతాయి. మనసుకు కష్టం కలిగించే విధంగా సొంత మనుష్యుల మాటలు ఉంటాయి. తృతీయ వారం కూడా అననుకులంగానే ఫలితాలు ఏర్పడును. చివరి వారం అనుకూలంగా ఉంటుంది. నూతన పనులు ప్రారంభించ వచ్చు. సువర్ణ సంబంధ పెట్టుబడులు లాభాలను ఏర్పరచును. ఈ మాసంలో 10 ,11, 16, 23 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
జూలై 2022 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నా , ఆరోగ్య విషయాలు చికాకు కలుగచేయును. అనారోగ్య సంబంధ ధన వ్యయం కొనసాగును. ఆశించిన స్థాయిలో పై అధికారులు లేదా తోటి ఉద్యోగుల నుండి సహకారం లభించదు. ఇరుగుపొరుగు వారితో విరోధములు అప్రతిష్టపాలు చేస్తాయి. స్థాన చలన ప్రయత్నాలు కలసి రావు. స్త్రీలకు సదా మానసిక ఆందోళన ఎదురగు సూచన ఉన్నది. ముఖ్యంగా 17, 18 తేదీలలో వాహన ప్రమాదమునకు సూచనలు అధికం. 19 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి , వ్యాపార విస్తరణకు అనుకూలమైన కాలం ఆరంభం అవుతుంది. అన్నివిధములా పరిస్థితులు చక్కబడతాయి. మొత్తం మీద ఈ మాసంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనుట మంచిది కాదు.
ఆగష్టు 2022 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసం ప్రారంభంలో ధన వ్యయం అధికం అవుతుంది. గృహ వాతావరణంలో మానసిక అశాంతి బాధిస్తుంది. బంధువులతో అనవసర వివాదాలు ఎదురవుతాయి. వృధా ధన నష్టం వలన బాధపడతారు. నూతన ఋణాలు దొరుకుట కష్టం. అధికంగా విఘ్నాలు ఎదురగుచుండును. ఉద్యోగ జీవనం లోని వారికి అవిశ్రాంత శ్రమ ఎదురగును. కొత్త విషయాలు నేర్చుకోవడంలో అనేక ఆటంకాలు ఎదురగును. మాసం ద్వితియార్ధం నుండి ఆర్ధికంగా కార్యానుకులత ప్రారంభం అవుతుంది. తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత ఉన్నతికి కారణమగు మార్పులు ఎదురగును. వ్యాపార వ్యవహారములు మాత్రం కొంచం మందగమనంతో కొనసాగును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యత ఉండదు. మాసాంతానికి ఖర్చులు అదుపులోకి వచ్చును.
సెప్టెంబర్ 2022 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సంతానానికి సంబందించిన సమస్యలు పరిష్కారమగును. ఆరోగ్య వంతమైన సంతానం లభిస్తుంది. ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలగుతాయి. రావలసిన ధనం ఈ మాసంలో చేతికి వస్తుంది. బంధు వర్గంతో ఏర్పడిన సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా విద్యార్ధులకు ఈ మాసం విజయవంతమైన కాలం. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. గృహంలో అనుకూల మార్పులు ఏర్పడతాయి. నూతన ఆదాయ మార్గాలు లభించడానికి సూచనలు ఉన్నవి. వ్యాపార వర్గం వారికి ప్రోత్సాహకర వాతావరణం ఎదురవుతుంది. ఈ మాసంలో 22 నుండి 24 వ తేదీల మధ్య ఒక స్వీయ తప్పిదం వలన అధిక వ్యయం ఏర్పడు సూచన ఉన్నది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహన చోదన విషయాలలో జాగ్రత్త అవసరం.
అక్టోబర్ 2022 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసం అన్ని విధాల అనుకూల ఫలితాలు ఏర్పరచును. వ్యాపార వ్యవహారాలు, నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ, అవివాహితుల వివాహ ప్రయత్నాలు విజయాన్ని పొందును. మీ పట్ల గౌరవ అభిమానాలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ పలుకుబడి పెరుగుతుంది. పుణ్య క్షేత్ర సందర్శన పుణ్య ఫలం పొందుతారు. ఈ మాసంలో ధన ఆదాయం పెరుగుతుంది. మనస్సుకు నచ్చిన ఆప్తుల మధ్య సమయం గడపగలుగుతారు. కోరుకున్న రీతిలో పనులు ముందుకు కొనసాగును. కుటుంబ ఉన్నతి కొరకు నూతన ఆలోచనలు చేయుట కలసివచ్చును. పోటీ పరీక్షలు రాయుటకు, వీసా సంబందిత , పరదేశ పౌరసత్వ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైనది.
నవంబర్ 2022 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. సొంత గృహ సంబంధ సంతోషాలు ఈ మాసంలో ఉన్నవి. ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులకు ఆశించిన కోర్కెలు అన్ని సిద్ధించును. ఈ మాసంలో కూడా ధన ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ ఉన్నతి లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసంలో 8 నుండి 19 వ తేదీల మధ్య కాలం అనుకూలమైనది. 15 నుండి 25 వ తేదీ మధ్యకాలం వివాహ మరియు సంతాన ప్రయత్నాలకు అనుకూలమైనది. 25 వ తేదీ తదుపరి మానసికంగా ఉల్లాస పడుదురు. మనుషుల మధ్య అంతరాలు తగ్గి మనస్సు తెలికపడును. యువత కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అనవసర ఆర్భాటాలకు ధనం వ్యయం చేయుట మానాలి.
డిసెంబర్ 2022 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కొంత సమస్యలు ఎదురగును. వ్యాపార ఉద్యోగ జీవనాలు అంత అనుకూలంగా ఉండవు. మిత్రుల వలన మానఃస్థాపం చెందుదురు. గృహ నిర్మాణ అవసరములకు సరిపడు ధనం లభించుట సమస్యగా మారును. మీ కష్టమునకు తగిన ఫలితం ఉండదు. పనులు వాయిదా పడుతూ ఉంటాయి. నూతన స్త్రీ పరిచయాల పట్ల జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కూడా ఈ మాసంలో అంతగా సహకరించదు. నూతన ఆలోచనలు అమలు చేయుట, ఆర్ధికంగా భారీ పెట్టుబడులు పెట్టుట ఈ మాసంలో మంచిది కాదు. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి లేదా ఉద్యోగ నష్టమునకు అవకాశం ఉన్నది. నూతన అవకాశములు చేజారుట వంటి దురదృష్టకర సంఘటనలు ఎదురగును. ఈ మాసంలో తరచుగా ఈశ్వర ఆలయ సందర్శన చేసుకొనుట మంచిది.
జనవరి 2023 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈీ మాసం ప్రధమ వారం అనేక చికాకులు ఏర్పరచును. చేపట్టిన పనులలో ఆటంకములు కొనసాగును. కుటుంబ సభ్యుల మధ్య విరోధాల వలన మానసిక శాంతి లోపించును. సంతానం చేసిన వృధా ఖర్చుల వలన మీ ఆర్ధిక ప్రణాళిక గాడి తప్పుతుంది. ఈ మాసంలో ధన ఆదాయం సామాన్యం. 17 వ తేదీ తదుపరి అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యలు తగ్గుతాయి. సంతాన సంబంధ ప్రయత్నాలలో నిరాశ ఎదురవుతుంది. తృతీయ వారంలో అఖస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయినవారిని కలుసుకుంటారు. ఒక దుర్వార్త వినవలసి వస్తుంది. మొత్తం మీద ఈ మాసం అంత అనుకూలమైనది కాదు.
ఫెబ్రవరి 2023 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. తెలిసిన వ్యక్తుల వలన లేదా నమ్మకస్తుల వలన ఒక నష్టం ఎదురగును. మైత్రీ సంబంధ వ్యవహారాలలో సదా జాగ్రత్త అవసరం. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగ జీవనంలో నూతన బాధ్యతలు పని భారాన్ని పెంచుతాయి. ఆశ్లేషా నక్షత్ర స్త్రీలకు గౌరవ హాని సంఘటనలు ఎదురగును. ఈ మాసంలో తలపెట్టిన ప్రతీ కార్యం ఆలస్యంగా పూర్తి చేయుదురు. హామీలు నేరవేర్చలేరు. ఆదాయ వ్యయాలు ఆశించిన విధంగా అదుపులో ఉండవు. అనవసరంగా ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకొనుట మీకు నచ్చదు. అయినా కూడా ఇతరులతో కటినమైన మాటలు మాట్లాడుట మంచిది కాదు.
మార్చ్ 2023 కర్కాటకరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో సంతృప్తికర వాతావరణం తిరిగి ఏర్పడుతుంది. చేపట్టిన పనులలో విజయం లభించి మీ ఆత్మస్థైర్యాన్ని తిరిగి పొందగలుగుతారు. ఆటంకములు తగ్గుతాయి. పితృ వర్గం వారికి మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వ్యాపారులకు ఉత్సహపురిత లాభాలు ఏర్పడతాయి. ధన విషయంలో అపోహలు తొలగుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. కుటుంబపరమైన ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఈ మాసంలో 10,13,20,22 మరియు 29 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.